మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్ననే ఢిల్లీ చేరుకున్న సీఎం.. ఈరోజు పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.
పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అంశంపై సీఎం మాట్లాడారు. ‘పరిపాలన చెయ్యాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరం. తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్లు ఎవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతాను. అమెరికా కాదంటున్న సంస్థలు ఇండియాకి రావాలి. తెలంగాణకు వెల్కమ్ చెబుతున్నాం. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి’ అని సీఎం కోరారు.
Also Read: Today Gold Price: చిన్న బ్రేక్.. మళ్లీ మొదలైన బంగారం ధరల మోత!
‘భవిష్యత్ తరాల కోసం అవకాశాలను క్రియేట్ చేయడమే మా ఆలోచన. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్. 2047 కోసం తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. 10 మిలియన్ పీపుల్స్ అర్బన్ ఏరియాలో నివసిస్తున్నారు. సెమీ అర్బన్ ఏరియాలో మాన్యుఫాక్చర్ జోన్‌గా నిర్ణయించాం. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. అందుకే 150 కిలోమీటర్ల మేర మెట్రో సెకండ్ ఫేజ్, మూసీ రివర్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాం. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, టెంపుల్-మసీదు-చర్చ్-గురుద్వారాల నిర్మాణంతో కల్చరల్ కనెక్టివిటీ, 2027 నాటికి హైద్రాబాద్ నగరంలో ఈవీ వెహికల్స్ రానున్నాయి. ఈవీ వెహికిల్ కోసం రాయితీలు ప్రకటించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
