CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి

Cm Revanth

Cm Revanth

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 1,000 రోజుల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా ప్రజల కోసం, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు బయటకు వచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. మూసారాంబాగ్‌ వద్ద నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ది, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయితే నగరం పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా సౌకర్యాలు లేవని, అందుకే హైదరాబాద్‌ను ‘కోర్ అర్బన్ రీజియన్’గా ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధి చేపడతామని వెల్లడించారు. పేరుకే అంబర్‌పేట్ నియోజకవర్గమని, అక్కడ ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో వర్షం వస్తే మునిగిపోయే మూసారాంబాగ్‌ బ్రిడ్జి సమస్యను తమ ప్రభుత్వమే చొరవ తీసుకుని పూర్తి చేసిందని స్పష్టం చేశారు.

అంబర్‌పేట్‌లో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. గతంలో హెలికాప్టర్లలో పూలు జల్లిన పాలకులు ‘బతుకమ్మ కుంట’ను కబ్జా చేశారని, తమ ప్రభుత్వం హైడ్రా (HYDRA) ద్వారా ఆ ఆక్రమణలను తొలగించి, ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేసుకునేలా కుంటను పునర్నిర్మించిందని చెప్పారు. తాను బతుకమ్మ కుంటను జూబ్లీహిల్స్‌కు తీసుకెళ్లలేదని, అక్కడ లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్లు కట్టలేదని చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 70 వేల కోట్లు అయితే, కేసీఆర్ ఒక్కడే తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. నెలకు వడ్డీలు, అసలు కలిపి 7,500 కోట్లు కడుతున్నామని, కేసీఆర్ తప్పుల వల్ల ఏడాదికి 90 వేల కోట్లు అప్పులకే చెల్లించాల్సి వస్తోందన్నారు. పదేళ్లలో కేసీఆర్ సాధించిన విజయం అప్పును 8.11 లక్షల కోట్లకు పెంచడమేనని ఎద్దేవా చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, జనవరి 1, 2024 నుండి ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా 5వ తేదీకల్లా వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం వదిలేసిన 8 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిల్లో 100 రోజుల్లోనే 6 వేల కోట్లు విడుదల చేశామని, పిఆర్‌సి అమలుతో పాటు కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్య భద్రతా కార్డులను పునరుద్ధరించామని వివరించారు.