NTV Telugu Site icon

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు..?

Revanth

Revanth

నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతమని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమన్నారు రేవంత్‌ రెడ్డి..

ఇవాళ పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది.. మిమ్మల్ని చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు దందాలు చేస్తే… ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు. మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండు. ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నాడు… దయాకర్ రావు నమ్మక ద్రోహి… మిత్ర ద్రోహి.. శత్రువులతో చేతులు కలిపి, కుట్రలు చేసి నన్ను జైలుకు పంపిండు… కాంగ్రెస్ కార్యకర్తలపై దయాకర్ రావు పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం. ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను… తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయం.

కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా… 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే. లేకపోతే వరంగల్ ఏకాశిలా పార్కు వద్ద ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్.. 2009లో నువ్వు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు అమ్ముకున్నావ్. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న దుర్మార్గుడివి నువ్వు. కోకాపేట భూములు అమ్ముకున్నది నువ్వు … నమ్మకం అంటే కాంగ్రెస్.. అమ్మకం అంటే బీఆర్‌ఎస్.. మీ దగ్గర దోచుకున్న సొమ్ముతో ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడులు పెడుతుండు.. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా పాలకుర్తిలో కాంగ్రెస్ ను గెలిపించండి… ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం… దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి..’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.