హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కొత్త ఇన్‌చార్జిగా సందీప్‌కు అవకాశం ఇచ్చారంటే అది అధిష్టానంపై ఉన్న నమ్మకమని పేర్కొన్నారు. తాను చెప్పిన మాట ఎప్పుడూ తప్పు కాలేదని, బీజేపీకి 242 సీట్లు వస్తాయని చెప్పానని, ఫలితాలు 240 దగ్గర ఆగాయని గుర్తు చేశారు. మన వాళ్లకు నమ్మకం లేక సరిగా పని చేయకపోవడం వల్లే 100 సీట్ల వద్ద ఆగిపోయామని, లేదంటే మనం అధికారంలోకి వచ్చేవాళ్లమని వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా మనం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వ్యూహం తమకు వదిలేసి, నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడాలని సూచించారు. ఎవరు ఏం చేస్తున్నారు, ముందు ఏం మాట్లాడుతున్నారు, వెనక ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలన్నీ తమకు తెలుసని స్పష్టం చేశారు.
ఐదేళ్లకు ఒకసారి బ్యాలెన్స్ షీట్.. క్రమశిక్షణపై హెచ్చరిక
రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుందని, ఖచ్చితంగా ఎన్నికల సమయంలో లెక్కలు కొలుస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లను, అలాగే పార్టీని కష్టపడి చెడగొట్టే వాళ్లను కూడా గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. పార్టీ లైన్‌లో ఉంటే పదవి తనంతట తాను ఇంటికి వస్తుందని చెప్పారు. గాంధీ భవన్ చుట్టూ తిరిగినా, ఢిల్లీలో పరిచయాలు ఉన్నా టికెట్లు రావని, పదవులు దక్కవని స్పష్టం చేశారు. నేతలు ఢిల్లీకి కాకుండా పల్లెలకు వెళ్లాలని, పేదలకు ఆత్మబంధువు అయితే వాళ్లే పార్టీకి ఆత్మబంధువు అవుతారని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కసి కారణమేనని ప్రశంసించారు.
సంక్షేమం, అభివృద్ధి.. 90 సీట్ల లక్ష్యం
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఆదర్శంగా నిలిచామని, 95 ఏళ్లుగా బీసీల లెక్క లేని పరిస్థితి ఉండేదని రేవంత్ పేర్కొన్నారు. కరువును ఎలా ఎదుర్కోవాలో అంతా సిద్ధం చేస్తున్నామని, ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో కోటి ఓట్లు, 90 సీట్లు గెలవడమే తన టార్గెట్ అని ప్రకటించారు. కోటి మందికి ఇందిరమ్మ చీరలు, కోటి మందికి బీమా, 50 లక్షల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు కూడా తాము ఇచ్చిన సన్న బియ్యం తింటున్నారని, వారి ఆడపడుచులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని అన్నారు. పథకం ఏదైనా పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామని, ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ మైక్‌లో చెప్పాలని సూచించారు. సమ్మక్క సారక్క దేవాలయం కట్టుకున్నామని, అచ్చంపేటలో సేవలాల్ గుడి కట్టుకుంటున్నామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల అంచనాలు, లొకేషన్ మార్చి కట్టడం వల్ల గోదావరిలో కొట్టుకుపోయాయని విమర్శించారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం.. 15 సీట్ల టార్గెట్
ఈసారి తెలంగాణ నుంచి 15 సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక డిస్కో డ్యాన్స్ చేసిందన్నట్లు కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని, అలా చేయడం మంచిది కాదని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఇందిరా గాంధీ మెదక్‌లో ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడిందని గుర్తు చేశారు. అందరం కలిసి జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామంటూ ఆయన ప్రసంగంతో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది.

