తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీకాలంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వహణలో తాము మానవత్వంతో వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులతో మాట్లాడిన సీఎం, వారి సమస్యల పరిష్కార బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు ఇంటికే వస్తాయని, ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల భవిష్యత్తు, బడులలో సౌకర్యాల పైనే దృష్టి పెట్టాలని కోరారు. ఐఏఎస్ అధికారులనైనా సులభంగా బదిలీ చేయవచ్చని, కానీ టీచర్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని కొనియాడారు. బడులలోని పిల్లల సమస్యలపై తనతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట
“ప్రభుత్వ బడులలో చదివితే ఏం అవుతావు?” అని ఎవరైనా అడిగితే, “తెలంగాణ సీఎం అవుతాను” అని పిల్లలు ధైర్యంగా చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని, ఎలాంటి మంత్రి పదవి అనుభవం లేకపోయినా ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్నిపాలిస్తున్నానని గుర్తుచేశారు. ఇటీవల తాను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని చెబుతూ, కేవలం తెలివి ఉంటే సరిపోదని, క్రమశిక్షణే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని నొక్కి చెప్పారు.
ఉపాధ్యాయులు అడగకపోయినా 2024 జనవరి నుంచి ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా సమయానికి వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం పెంచామని వివరించారు. అమెరికాపైనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల వైపు దృష్టి సారించాలని, భాష అనేది కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

