Site icon NTV Telugu

Return Rush to Hyderabad: హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు.. రద్దీగా మారిన హైవేలు..

Return Rush

Return Rush

Return Rush to Hyderabad: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ కోసం ఏపీకి వచ్చినవారు తిరిగి తమ ఉద్యోగాలు, విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు బయల్దేరడంతో జాతీయ రహదారులపై తీవ్ర వాహన రద్దీ నెలకొంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బెజవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భారీగా వాహనాలు బయల్దేరడంతో టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. గన్నవరం సమీపంలోని కలపర్రు, గొట్టిపాడు టోల్ ప్లాజాలు, నందిగామ వద్ద కేసర, జగ్గయ్యపేట పరిధిలోని చిలకలు టోల్ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ కొనసాగుతోంది.

Read Also: Deputy CM Pawan Kalyan: చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది.. కాకినాడని ఎంచుకోవడం సంతోషం..

నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 80 వేలకుపైగా వాహనాలు రావడంతో ఇదే రకమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు సెలవులు పూర్తవడంతో అందరూ తిరిగి హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ వాహన రద్దీ ఇవాళతో పాటు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని అంబారుపేట వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఫ్లైఓవర్‌పై వాహనాలకు అనుమతి ఇచ్చి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు బెజవాడ నగరంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోకి వాహనాలు రాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో బెజవాడలో ట్రాఫిక్ సజావుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పల్లెల్లో ఆనందంగా జరుపుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఇప్పుడు తిరిగి పట్నం బాట పట్టారు. ఇవాళ ఎక్కువగా వాహనాలు హైదరాబాద్‌కు వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. రేపు కూడా కొంతమేర ట్రాఫిక్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version