Site icon NTV Telugu

Yemmiganur: ఎమ్మిగనూరు టీడీపీలో చల్లారని మంటలు.. నేతల రాజీనామా బాట..!

Yemmiganur

Yemmiganur

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ నేతలు, క్యాడర్ అంతా ఒకే బాట, ఒకే మాట. ఇపుడు ఆ పరిస్థితి లేదు.. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. ప్రతీ సందర్భంలోనూ ఆయన్ను టార్గెట్‌ చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. పార్టీకి నిత్యం వెన్నంటి వుండే ద్వితీయ శ్రేణి టీడీపీ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పెత్తనం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు.

Read Also: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. దయాసాగర్ బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అలాగే నందవరంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కూడా పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మిగనూరులో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి టీడీపీ క్యాడర్ బ్రహ్మరథం పట్టింది. కానీ, క్రమంగా టీడీపీ క్రియాశీల నేతలకు, బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి గ్యాప్ పెరుగుతోంది. దీనికి కారణం సొంతపార్టీ వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమేనని చర్చించుకుంటున్నారు. గతంలో జడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతిని కూడా అసమ్మతి ముద్ర వేసి సస్పెండ్ చేయించారన్న ఆరోపణ ఉంది. అయితే ఎమ్మెల్యే కూడా తనను కొందరు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది చూడాలి.

Exit mobile version