SLBC Tunnel: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రక్షణ చర్యల్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు కూడా చేయబడింది. ఇక తాజాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసేందుకు అధికారులు ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకొగా ఆ తర్వాత ప్రమాద స్థలానికి చేరుకోనున్నారు. ర్యాట్ హోల్ మైనర్లు బృందం ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి చూసిన తర్వాతే మేము ఏం చేయగలం అనేది చెప్పగలమని అన్నారు. అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా..? లేక ప్రతికూల పరిస్థితులు ఉంటే రెస్క్యూ టీమ్స్ తో కలిసి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చెప్తామని చెప్పుకొచ్చారు. బురద, నీరు ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారని, ఘటన దెగ్గరికి వెళ్ళి చూసి అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని అన్నారు.
Read Also: IND vs PAK: రాయుడు ఏంటి మన సెలబ్రిటీలను అంత మాటన్నాడు.. వీడియో వైరల్!
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బొరియిలా చిన్న సొరంగాలను తవ్వి భూగర్భం నుండి బొగ్గును వెలికి తీయడాన్ని సూచించే ఒక విధానం. ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతిగా భావించినప్పటికీ, ప్రత్యేక రక్షణ చర్యల్లో ర్యాట్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తారు. 2023లో ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రభుత్వ, ప్రత్యేక దళాలు 17 రోజులపాటు ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయాయి. కానీ, ర్యాట్ హోల్ మైనర్స్ ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు.
Read Also: Rajasthan : 19గంటలకు పైగా 32 అడుగుల లోతు బోరుబావిలోనే 5 ఏళ్ల చిన్నారి… కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ నేపథ్యంలో, శ్రీశైలం టన్నెల్ ప్రమాదం నుంచి కార్మికులను కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలోకి దింపడం ఒక కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. అధికారులు, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలను మరింత వేగంగా చేపడుతున్నారు. ఈ రక్షణ చర్యలు ఎంత త్వరగా విజయవంతమవుతాయో వేచిచూడాల్సి ఉంది.