Republic day celebrations in Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఓపెన్ టాప్ వెహికల్ ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ వివిధ పెరేడ్ కవాతులను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.శ్రీకాంత్ పర్యవేక్షణలో పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన వ్యక్తులందర్నీ ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 74 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావిస్తూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 2.20 లక్షల మంది రైతులకు రూ 110 కోట్లను రైతు భరోసా సాయంగా అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని రైతాంగానికి 6,183 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు 53,730 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించి సాగుకు రుణాల అందించడం జరిగిందన్నారు. అలాగే ఉచిత పంటలు బీమా పథకం కింద 50,314 మంది రైతులకు 100 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా అందజేయడం జరిగిందన్నారు.
ఖరీఫ్ లో 63,586 మంది రైతుల నుండి 3.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయడం జరిగిందన్నారు. అక్వారంగం మరింత అభివృద్ధి సాధించేందుకు నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న 19 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంత పరిధిలో 43,776 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ ద్వారా ఈ సంవత్సరం ఇప్పటివరకు 1.64 లక్షల టన్నుల చేపలు, 1.46 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరిగిందని, దేశంలోనే ఆక్వా ఉత్పత్తులలో ముందంజలో ఉన్నామన్నారు. 1,407 మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద ఒక కోటి 40 లక్షల రూపాయలను అందించడం జరిగిందన్నారు. పశుసంపద అభివృద్ధికి 95,340 పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేసి 33,710 మేలు జాతి దూడలను ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.
Read Also:Shardul Thakur: వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్
పశువులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 30 అమూల్ పాల కేంద్రాలను ఏర్పాటు చేసి 845 మహిళా పాడిరైతుల నుండి రోజుకు 2,573 లీటర్ల పాల సేకరణ చేయడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో కాలువలు, డ్రైన్ లు అభివృద్ధికి 135 పనులకు 16.3 కోట్లు మంజూరుచేసి 44 పనులను పూర్తి చేయడం జరిగిందని, 38 కాలువలు, నాలుగు డ్రైన్ లు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో 601 లేఔట్ల ను ఏర్పాటుచేసి 72,636 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు . జిల్లాలో అవ్వ, తాతలు, వితంతు, దివ్యాంగ పెన్షన్లు మొత్తం 2,22,974 పెన్షనర్లకు గాను ప్రతినెల 61 కోట్లు వారికి అందజేయడం జరుగుచున్నదన్నారు. జిల్లాలోని 16,551 స్వయం సహాయక సంఘాలకు 965 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ ఆసరా కింద 30,566 ఎస్. హెచ్.జి లకు ఇప్పటివరకు 534 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 30,441 సంఘాలకు 168 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. వైయస్సార్ చేయూత పథకం కింద 81,294 మంది లబ్ధిదారులకు 153 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. జగనన్నతోడు పథకం కింద 66,113 మంది లబ్ధిదారులకు 66 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. స్త్రీనిధి పథకం కింద 20,750 మంది స్వయం సహాయ సంఘాలకు 81.44 కోట్ల రుణాలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 1.47 లక్షల మంది కూలీలకు 39.74 లక్షల పని దినాలు కల్పించడం ద్వారా 71 కోట్ల రూపాయలను వేతనంగా చెల్లించడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే సంకల్పంతో 8వ తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో ఒక్కొక్కటి 29 వేల రూపాయలు విలువగలిగిన 16,273 టాబ్ లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మవడి పథకాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు.
జిల్లాల నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధికి మొదటి, రెండవ విడతల్లో 1,236 పాఠశాలను ఎంపీక చేసి 158 కోట్ల రూపాయలనుతో పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుచున్నదన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 19 వాహనాలు కేటాయించి వాటి ద్వారా వైద్య సిబ్బంది 1,406 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 64,556 మందికి చికిత్సలను అందించడం జరిగిందన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 33,897 మంది పేదలకు 74 కోట్ల రూపాయల విలువ కలిగిన శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా జగనన్న వసతి దీవెన క్రింద 61,026 మంది విద్యార్థులకు 52 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది అన్నారు. జగనన్న విద్యా దీవెన దీవెనకు 58,429 మంది విద్యార్థులకు 41 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 17,343 మంది విద్యార్థులకు 21 కోట్ల రూపాయలు వసతి దీవెన, 16,537 మంది విద్యార్థులకు 10 కోట్ల రూపాయలు విద్యా దీవెన, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 195 మంది విద్యార్థులకు 19 లక్షల రూపాయలు వసతి దీవెన, 195 మంది విద్యార్థులకు 22 లక్షల రూపాయలు విద్యా దీవెన అందజేయడం జరిగిందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 242 పంది పాస్టర్లకు, 51 మంది ఇమామ్ అండ్ మౌజాన్ లకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనంగా ప్రతినెలా అందజేయడం జరుగుతుందన్నారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, పాల సీతలీకరణ కేంద్రాలు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా జిల్లాలోనీ 992 ఆవాసాల్లో సుమారు 3,48,154 గృహాలకు గాను ఇప్పటివరకు 2,80,475 త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 3,401 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1,163 కోట్ల రూపాయలతో స్థాపించడం ద్వారా 29,238 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అలాగే 26 భారీ పరిశ్రమలు ఏర్పాటుతో 12,833 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. శాశ్వత భూహక్కు భూ రక్షా పథకం కింద వివాదరహిత భూముల ఏర్పాటుకు 15 మండలాల్లో 16 గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసి భూ రిసర్వే పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ జనాభాకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని 97 గ్రామాల్లో 43 ఎకరాల భూమిని ఎస్సీ స్మశానవాటికలకు కేటాయించడం జరిగిందన్నారు.
నూతన జిల్లా ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 12,266 స్పందన ఫిర్యాదులు అందగా వాటిలో 11,923 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే జగనన్నకు చెబుతాం కార్యక్రమం ద్వారా 5,060 ఫిర్యాదులు అందగా వాటిలో 4,994 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. చివరిగా జిల్లా యంత్రాంగానికి, శాంతి భద్రతల పరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండల సభ్యులు, శాసనసభ్యులు, వివిధ రంగాల రంగాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ జెవి మురళి, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాసరావు, ఎం ఎస్ ఎం ఈ చైర్మన్ వంక రవీంద్ర, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సర్రాజు, భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాసరావు, ఇన్చార్జి డిఆర్ఓ దాశీరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Nabha Natesh : గన్ పట్టిన నభా..