Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో కాకుండా రిలయన్స్ ఆధ్వర్యంలోని వయాకామ్ 18లో భాగమైన టీవీ18 ఓటీటీ ప్లాట్‌ఫారం ద్వారా ప్రసారం కానుంది. దీంతో హాట్‌స్టార్‌ను ప్రమోట్ చేయకూడదని జియో నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈనెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ మాత్రం డిస్నీ హాట్‌స్టార్‌లోనే ప్రసారం కానుంది. దీని కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని భావించిన యూజర్లు మాత్రం నిరాశ చెందుతున్నారు.
Read Also: Axis Bank: యాక్సిస్ బ్యాంకు యూజర్లకు గుడ్ న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
అయితే రెండు ప్లాన్‌లలో మాత్రం డిస్నీ హాట్ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను జియో అందిస్తోంది. రూ.1499, రూ.4,199 ప్లాన్‌లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. రూ.1499 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు వినియోగదారుడు ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అటు రూ.4199 ప్లాన్ ద్వారా 365 రోజుల పాటు వినియోగదారుడు ప్రతిరోజూ 3జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. కాగా జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండియా స్పోర్ట్స్ 18 పేరుతో సొంతంగా స్పోర్ట్స్ ఛానల్‌ను ప్రారంభించింది. వూట్ యాప్‌లోనూ ఈ ఛానల్ కంటెంట్ స్ర్టీమింగ్ కానుంది. అలాగే ఐపీఎల్ మీడియా డిజిటల్ హక్కులను రిలయన్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ మొత్తంతో వీటిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తమ స్పోర్ట్స్ 18కి పోటీదారు స్టార్ నెట్ వర్క్‌కు చెందిన హాట్ స్టార్‌తో టై అప్‌ను జియో రద్దు చేసుకుందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
