Axis Bank: యాక్సిస్ బ్యాంకు యూజర్లకు గుడ్ న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ ఖాతాదారులకు వడ్డీ రేట్లను సమీక్షిస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లను నేటి నుంచి అమల్లోకి వస్తాయని తన అధికారిక వెబ్ సైట్లో తెలిపింది. యాక్సిస్ బ్యాంకు తన వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ పెంపు తర్వాత యాక్సిస్ బ్యాంకు 7 రోజుల నుంచి పదేళ్ల కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సామాన్య ప్రజలకు 3.50 శాతం నుంచి 6.10 శాతం మధ్యలో వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 6.85 శాతం మధ్యలో వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది.
బ్యాంకు 7 రోజుల నుంచి 29 రోజుల కాల వ్యవధిలోని డిపాజిట్లపై వడ్డీ రేటును 2.75 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. అలాగే 30 నుంచి 60 రోజుల వ్యవధిలోని డిపాజిట్లపై వడ్డీ రేట్లను 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 3 నెలల కాల వ్యవధిలోని డిపాజిట్లకు 75 బేసిస్ పాయింట్ల పెంపు చేపట్టి ప్రస్తుతం 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మూడు నెలల నుంచి 6 నెలల వ్యవధిలోని డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగింది. 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 10 నెలల నుంచి ఏడాది వరకున్న డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరగడంతో.. ఈ కస్టమర్లకు ప్రస్తుతం 5 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి ఏడాది 11 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేట్లు 65 బేసిస్ పాయింట్లు పెరిగి 6.10 శాతానికి చేరుకున్నాయి. ఏడాది 11 రోజుల నుంచి ఏడాది 25 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10 శాతానికి పెరిగింది. ఏడాది 25 రోజుల నుంచి 15 నెలల మధ్యలోని డిపాజిట్లపై 6.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
Read Also: Intermediate Board: ఇంటర్‌లో మళ్లీ పాత పద్దతి.. వంద శాతం సిలబస్..
15 నెలల నుంచి రెండేళ్ల వరకున్న డిపాజిట్లకు 6.15 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.20 శాతం వడ్డీ రేటును బ్యాంకు ఆఫర్ చేస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంకు డిపాజిటర్లకు 6.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్యలో కాలం చేసే డిపాజిట్లపై వడ్డీ రేటు 5.75 శాతం నుంచి 6.10 శాతం పెరిగింది. దీంతో అత్యధికంగా రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 6.95 శాతం వడ్డీ రేటును పొందుతారు.