Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!

  • రెడ్‌మీ నోట్‌ 17 ప్రో మ్యాక్స్‌ భారత్‌లో లాంచ్‌
  • 10,000mAh సిలికాన్‌-కార్బన్‌ భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్డ్‌ రివర్స్‌ ఛార్జింగ్‌
  • 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 3,500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌
  • డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌, స్టీరియో స్పీకర్లు
  • స్నాప్‌డ్రాగన్‌ 6 Gen 5 చిప్‌సెట్‌..
Redmi Note 17 Pro Max

Redmi Note 17 Pro Max

Redmi Note 17 Pro Max: రెడ్‌మీ నోట్ 17 సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ (Redmi Note 17 Pro Max) భారత మార్కెట్లోకి వచ్చింది. ఇందులో భారీ 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 చిప్‌సెట్, 50MP OIS కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. భారీ బ్యాటరీతో పాటు ప్రీమియం అనుభవాన్ని అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.

డిజైన్, కలర్ ఆప్షన్లు

రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్‌ డిజైన్ నోట్ 17 ప్రోను పోలి ఉంటుంది. ఇందులో ఫ్లాట్ ప్లాస్టిక్ ఫ్రేమ్, గుండ్రటి అంచులు, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉన్నాయి. ఫోన్ మందం సుమారు 8.6 మిల్లీమీటర్లు. వెనుక భాగంలో చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్ ఉంది. అయితే నోట్ 17 ప్రోతో పోలిస్తే ప్రో మ్యాక్స్‌లో రెండు ప్రత్యేక కెమెరా కటౌట్లు కనిపిస్తాయి. ఈ ఫోన్ సీక్రెట్ సన్‌రైజ్, మ్యాచా గ్రీన్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం IP66/IP68/IP69/IP69K రేటింగ్‌లు కూడా ఉన్నాయి.

1.5K AMOLED డిస్‌ప్లే

రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 12-bit ప్యానెల్ కావడంతో 68.7 బిలియన్ రంగులను ప్రదర్శించగలదు. డిస్‌ప్లే గరిష్ఠంగా 3,500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 2,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లభిస్తాయి.

10,000mAh బ్యాటరీ

ప్రో మ్యాక్స్‌లో అతిపెద్ద హైలైట్ 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. షియోమీ ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద బ్యాటరీ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ 1,600 ఛార్జింగ్ సైకిళ్లు పూర్తయిన తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని నిలుపుకునేలా టీవీ ఎస్‌డీ 5-స్టార్ బ్యాటరీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. కంపెనీ లెక్కల ప్రకారం ఇది సుమారు ఆరేళ్ల వినియోగానికి సమానం.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్

పెర్ఫార్మెన్స్ కోసం Redmi Note 17 Pro Maxలో Qualcomm Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను అందించారు. భారత్‌లో ఈ చిప్‌సెట్‌తో వచ్చిన తొలి ఫోన్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఫోన్‌లో గరిష్ఠంగా 12GB LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ అందించారు. వేగవంతమైన యాప్స్ లోడింగ్, మల్టీటాస్కింగ్, డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది.

50MP OIS కెమెరా

ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. దీనికి OIS సపోర్ట్ ఉంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. హై డైనమిక్ పోర్ట్రెయిట్, నైట్ పోర్ట్రెయిట్‌తో పాటు AI క్రియేటివిటీ సూట్లో గ్లేర్ రిమూవల్, రిఫ్లెక్షన్ రిమూవల్, ఎరేజ్, ఎక్స్‌పాన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

HyperOS 3, HyperAI

Redmi Note 17 Pro Max ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది. నాలుగేళ్ల OS అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కంపెనీ అందించనుంది. HyperAIలో ఆఫ్‌లైన్ ఇంటర్‌ప్రెటర్, స్పీచ్ రికగ్నిషన్, డీప్ థింక్ రైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయంలో కూడా కిలోమీటర్ స్థాయిలో కమ్యూనికేషన్ చేసుకునేందుకు ఆఫ్ లైన్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను అందించారు.

ధర

భారత్‌లో 8GB + 256GB వేరియంట్ ధర రూ.44,999 కాగా, 12GB + 256GB మోడల్ ధర రూ.50,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 23, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల ద్వారా గరిష్ఠంగా రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.