New Currency Notes: పాత కరెన్సీ బ్యాన్ అనగా.. వెంటనే నోట్ల రద్దు.. ఆ తర్వాత పడిన ఇబ్బందులు.. పరిణామాలు దేశ ప్రజలకు గుర్తుకు వస్తాయి.. అయితే, ఇప్పుడు కూడా మరోసారి ఆ పరిస్థితి రానుందా? అంటే.. పా నోట్లు మొత్తం మాయమై.. కొత్త కరెన్సీ రావచ్చు.. భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ ఆధారిత ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కసరత్తు ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి.. పెరుగుతున్న ముద్రణ ఖర్చులు, చెడిపోయే నోట్ల సంఖ్య అధికమవడం వంటి కారణాలతో ఆర్‌బీఐ ఈ దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
ఇటీవల పాట్నా, ముంబైలో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయని, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, అలాగే భద్రతా పరంగా కూడా మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నోట్లు చిరగవు, తడిసినా త్వరగా పాడవు, సులభంగా కరగవు. ఇక, ఏటీఎం యంత్రాల ద్వారా కూడా పాలిమర్ నోట్లు సులభంగా విడుదల చేయవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక వనరులు ఆర్‌బీఐ వద్ద ఇప్పటికే ఉన్నాయని సమాచారం. ప్లాస్టిక్ నోట్ల వినియోగంపై ఆర్‌బీఐ ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా సిద్ధం చేస్తోందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
కాగితపు నోట్ల ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పుపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. ఆర్‌బీఐ 2025 ఆర్థిక సంవత్సరపు వార్షిక నివేదిక ప్రకారం, నోట్ల ముద్రణ ఖర్చు గత ఏడాది రూ.5,101.4 కోట్ల నుంచి రూ.6,372.8 కోట్లకు పెరిగింది. నగదు వినియోగం పెరగడం వల్లే ఈ ఖర్చులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 23.8 బిలియన్ చెడిపోయిన నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.3 శాతం అధికం. ఇందులో ఎక్కువగా రూ.500 నోట్లు, ఆ తర్వాత రూ.100 నోట్లు ఉండటం గమనార్హం.
డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మే 15 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.42.86 ట్రిలియన్లకు చేరిందని నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.5 శాతం ఎక్కువ. FY27 తొలి ఒకటిన్నర నెలల్లోనే చలామణిలో ఉన్న కరెన్సీ రూ.1.15 ట్రిలియన్లు పెరిగినట్లు సమాచారం. మరోవైపు, కాయిన్ల వినియోగాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 2025 ఆర్థిక సంవత్సరంలో కాయిన్ల సరఫరా 1.5 బిలియన్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రూ.5 కాయిన్లు ఉండగా, ఆ తర్వాత రూ.20 కాయిన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తంగా భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశిస్తే నగదు నిర్వహణలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ముద్రణ ఖర్చులు తగ్గడమే కాకుండా, నోట్ల మన్నిక కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆర్‌బీఐ.. ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయమే..
