NTV Telugu Site icon

RBI Governor on CryptoCurrencies: తదుపరి ఆర్థిక మాంద్యం క్రిప్టోకరెన్సీలతోనే..

Rbi Governor On Cryptocurrencies

Rbi Governor On Cryptocurrencies

RBI Governor on CryptoCurrencies: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు.

తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదని, ఈ వర్చువల్‌ కాయిన్లను తక్షణం నిషేధించాలని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ నియంత్రణలతో క్రిప్టో కరెన్సీల వినియోగానికి అనుమతివ్వాలనే ఆలోచన సైతం సరికాదని శక్తికాంతదాస్‌ తేల్చేశారు.

read also: Indian Box Office Report: 2022లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు

క్రిప్టో కరెన్సీల భవిష్యత్తుపై పెట్టుబడిదారులకు సైతం నమ్మకం కలగట్లేదని, అందుకే వాటి గ్లోబల్‌ మార్కెట్‌ విలువ 180 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని గుర్తుచేశారు. క్రిప్టో కరెన్సీ నిర్వాహకులకు కనీస బాధ్యత లేదని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్నా, నియంత్రణ ఆర్థిక ప్రపంచమన్నా లెక్క లేదని శక్తికాంతదాస్‌ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను కట్టడి చేయటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇటీవలే సొంతగా డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2022 ప్రారంభంలో.. క్రిప్టో కరెన్సీ లాభాలపై ఏకంగా 30 శాతం పన్ను విధించింది.

ఒక్కో లావాదేవీ నుంచి ఒక శాతం మొత్తాన్ని మినహాయించుకుంటోంది. మరికొన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలు క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల పైన మరియు పేమెంట్‌ ఛానల్స్‌ పైన ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గుచూపటం తగ్గుముఖం పట్టింది.