Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ… ‘మహిళల భద్రత, సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాయలసీమ, కాకినాడ జిల్లాల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విద్యార్థినులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలి. మహిళల భద్రత కోసం శక్తి యాప్‌తో పాటు 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయి. ఎలాంటి సమస్యనైనా 181 నంబర్‌కు కాల్ చేసి చెప్పవచ్చు. వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా మహిళలకు వసతి కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.
Also Read: Asia Cup 2025: అభిమానులకు కీలక అప్‌డేట్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు!
‘ఫోన్లను దుర్వినియోగం చేయడంవల్ల మన సమస్యలకు మనమే కారణమవుతున్నాం. ఫోన్ వినియోగ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ స్నేహాల వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు పెరిగాయి. వీటివల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారు. కొందరు మార్నింగ్ ఫోటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్నారు, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఆత్మహత్య వంటి ఆలోచన చేయవద్దు. చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన పోక్సో చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పది మంది మహిళా ఉద్యోగులు గల ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదు కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వివాహానికి పూర్వమే కౌన్సిలింగ్ నిర్వహించే సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మహిళా కమిషన్ కొన్ని కేసులను సుమోటోగా తీసుకుంటోంది. వ్యభిచారానికి అంగీకరించలేదని భార్యను హత్య చేసిన కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది’ అని రాయపాటి శైలజ చెప్పారు.
