ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్-1 టెస్ట్ ఆల్ రౌండర్ సింహాసనాన్ని కోల్పోయాడు. ఏకంగా 1,683 రోజుల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జడ్డూకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సెన్ తాజా ర్యాంకింగ్స్‌లో జడేజాను వెనక్కి నెట్టి నంబర్-1 పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో జాన్సెన్ అద్భుతమైన ప్రదర్శనే ఈ మార్పునకు కారణమైంది. గ్కెబెర్హా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్సెన్ బ్యాటింగ్‌లో కీలకమైన 85 పరుగులు చేయడంతో పాటు, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
ఈ ప్రదర్శనతో 26 ఏళ్ల జాన్సెన్ కేవలం ఆల్ రౌండర్ రికార్డే కాకుండా, వ్యక్తిగత విభాగాల్లోనూ సత్తా చాటాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరుకోగా, బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో ఒక స్థానం మెరుగుపరుచుకుని జడేజా రాజ్యాజ్యానికి తెరదించాడు. ప్రస్తుతం 422 రేటింగ్ పాయింట్లతో జడేజా రెండో స్థానానికి పడిపోయాడు. సరిగ్గా 2022 మార్చి 20న జాసన్ హోల్డర్ నుంచి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్న జడేజా.. సరిగ్గా నాలుగేళ్లకు పైగా ఆ స్థానంలో ఎలాంటి సవాళ్లు లేకుండా నిలకడగా కొనసాగడం విశేషం.
ఇదే సమయంలో మరో యువ ఆటగాడు టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే శతకం బాది, మొత్తంగా 38 బంతుల్లో 113 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు సెంచరీతో అతను ఇషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ టీ20 బ్యాటర్ల జాబితాలో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఏడాది జూలైలో ఇషాన్ కిషన్ ఈ స్థానాన్ని అభిషేక్ నుంచి కైవసం చేసుకోగా.. అంతకుముందు 2025 జూలైలో ట్రావిస్ హెడ్‌ను వెనక్కి నెట్టి అభిషేక్ మొదటిసారి ఈ శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

