నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు ఖండాలు దాటింది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాషతో సంబంధం లేకుండా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇక జపాన్‌లో ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటి. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా తన జపాన్ పర్యటనకు సంబంధించిన మధుర స్మృతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రష్మిక భావోద్వేగానికి గురైంది. జపాన్ ప్రజలు చూపించిన అంతులేని ప్రేమను చూసి తన కళ్లు చెమర్చాయని ఆమె పేర్కొంది.
Also Read : Lenin: అఖిల్ ‘లెనిన్’ షూటింగ్ అప్‌డేట్..
‘జపాన్‌లో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్నాను, కానీ ఆ తక్కువ సమయంలోనే నాకు లభించిన ప్రేమ వెలకట్టలేనిది. అక్కడి అభిమానులు నాకు ఎన్నో ప్రేమలేఖలు, అందమైన బహుమతులు అందించారు. వాటన్నింటినీ చదివినప్పుడు నేను ఎంత ఎమోషనల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. ఆ బహుమతులన్నీ నేను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాను’ అని రష్మిక తన పోస్ట్‌లో తెలిపింది. అంతేకాకుండా, త్వరలోనే మళ్ళీ జపాన్ వస్తానని, ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటానని చెబుతూ.. వచ్చేసరికి కచ్చితంగా జపనీస్ భాష నేర్చుకుంటానని తన అభిమానులకు ప్రామిస్ చేసింది. ప్రస్తుతం ‘మైసా’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
