Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!

  • రంజీ ట్రోఫీలో బ్యాట్‌తో అదరగొట్టిన రవీంద్ర జడేజా
  • ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున 102 పరుగులు
  • 209 బంతుల్లో 7 ఫోర్లతో సెంచరీ నమోదు
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జడేజాకు ఇది 16వ సెంచరీ..
Ravindra Jadeja Century

Ravindra Jadeja Century

Ravindra Jadeja Century: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీట్రోఫీలో బ్యాట్‌తో సత్తాచాటాడు. ఛత్తీస్‌గఢ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసిన అతడు 209 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జడేజాకు ఇది 16వ సెంచరీ కావడం విశేషం.

సౌరాష్ట్ర 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జడేజా క్రీజులోకి వచ్చాడు. జట్టు నుంచి భారీ ఇన్నింగ్స్ అవసరమైన సమయంలో తొందరపడకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. సుమారు 48 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. జడేజాతో పాటు ప్రేరక్ మాంకడ్ కూడా అద్భుతంగా రాణించాడు. వీరిద్దరి కీలక భాగస్వామ్యం సౌరాష్ట్ర భారీ స్కోరు సాధించడంలో కీలకంగా మారింది. మాంకడ్ 150 బంతుల్లో 129 పరుగులు చేశాడు. చిరాగ్ జానీ 83 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌లో ఆసక్తికరమైన విషయం కూడా చోటుచేసుకుంది. అతడిని ఔట్ చేసిన బౌలర్ పేరు కూడా జడేజానే కావడం విశేషం. గతంలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ధర్మేంద్రసింగ్ జడేజా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తరఫున ఆడుతున్నాడు. అతడి బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా 102 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో దేవ్ ఆదిత్య సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతడు ఐదు వికెట్లు పడగొట్టగా.. ధర్మేంద్రసింగ్ జడేజా, రుద్ర ప్రతాప్ దిహారీ చెరో రెండు వికెట్లు సాధించారు. భారత జట్టు తరఫున ఒక మ్యాచ్ ఆడిన సందీప్ వారియర్‌కు ఒక వికెట్ దక్కింది.

సౌరాష్ట్రను 392 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సానిధ్య హుర్కత్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టినా.. రెండో బంతికే ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో సమర్ గజ్జర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతానికి ఛత్తీస్‌గఢ్‌ స్కోర్ 11 ఓవర్లకు 34/2 గా ఉంది.