NTV Telugu Site icon

Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పుల వివాదంతో యువకుడి దారుణ హత్య

Murder

Murder

Murder : రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామానికి చెందిన సుధాకర్‌ (34), డ్రైవింగ్‌ చేస్తూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన శశికళ తన అవసరాల కోసం సుధాకర్‌ వద్ద డబ్బు అప్పుగా తీసుకుంది. నిన్న మధ్యాహ్నం సుధాకర్‌కు డబ్బు అవసరం కావడంతో శశికళ ఇంటికి వెళ్లి తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే ఈ విషయంలో సుధాకర్‌కు శశికళ, ఆమె తమ్ముళ్లు మాదరమోని శేఖర్‌, వినయ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శశికళ, సుధాకర్‌పై కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కూడా తనపై నమోదైన ఫిర్యాదుకు సమాధానం చెప్పేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలని భావించాడు. తన తల్లి వసంతను బైక్‌పై ఎక్కించుకుని సాయంత్రం 5 గంటలకు కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ వైపు బయల్దేరాడు. అయితే, మధ్యాహ్నం జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న శశికళ తమ్ముళ్లు, సుధాకర్‌ను హత్య చేయాలని పథకం వేశారు.

వినయ్‌ స్కూటీపై సుధాకర్‌ వెనుక వచ్చేవిధంగా జాగ్రత్తలు తీసుకోగా, లేమూరు గ్రామం దాటి ఎవరూ లేని ప్రదేశంలో ముందుగా వేచిచూస్తున్న శేఖర్‌ బైక్‌ను ఎదురుగా నడిపి సుధాకర్‌ బైక్‌కి ఢీకొట్టాడు. దాంతో సుధాకర్‌ తల్లి వసంతతో కలిసి రోడ్డుపై పడిపోయాడు. వెంటనే శేఖర్‌, వినయ్‌ ఇద్దరూ కర్రలతో అతడిపై దాడి చేసి క్రింద పడేశారు. అనంతరం పక్కనే ఉన్న రాళ్లతో అతడి ముఖంపై విచక్షణరహితంగా కొట్టారు.

ఇదంతా చూస్తూ తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి వసంతను కూడా కాలితో తన్ని రాయితో కొట్టారు. సుధాకర్‌ తీవ్ర గాయాల పాలై రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దుండగులు అతడు మరణించాడని అనుకుని అక్కడి నుంచి పారిపోయారు.

తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం తుక్కుగూడలోని ప్రైమ్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు సీఐ సీతారాం తెలిపారు.

Mohanlal : లూసీఫర్-2 కోసం మోహన్ లాల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?