Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..

Ramayana Mangal Rang

Ramayana Mangal Rang

Ramayana Song Controversy: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ నుంచి ఇటీవల విడుదలైన ‘మంగళ రంగ్’ పాట సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ, విమర్శలకు దారితీసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట శ్రీరామచంద్రుడు, సీతాదేవిల పవిత్ర ప్రేమను, వారి ప్రయాణాన్ని కీర్తిస్తూ సాగుతుంది. అయితే, ఈ పాటకు ఉపయోగించిన సూఫీ ఖవ్వాలీ తరహా సంగీత శైలిపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూఫీ ఖవ్వాలీ అనేది భక్తి, ఆధ్యాత్మిక భావాలతో కూడిన ఓ సంగీత ప్రక్రియ. ఈ పాటలో ఉపయోగించిన ట్యూన్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రామాయణం లాంటి పవిత్ర ఇతిహాసానికి ఇలాంటి ట్యూన్లు ఏమాత్రం సరిపడవంటూ ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. మరికొందరు ఈ పాత మూవీలోని ట్యూన్స్ కాఫీ కొట్టాడంటూ ఫైర్ అవుతున్నారు.

ఈ పాటపై వస్తున్న విమర్శల్లో ప్రధానంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎంపికపైనే ఎక్కువ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి రామాయణంలోకి సూఫీ ఖవ్వాలీ బీట్స్ తీసుకొనిరావడం బాలీవుడ్ మతిమరుపునకు నిదర్శనమని, భారీ బడ్జెట్ ఉందంటూ పాత టెంప్లేట్లను ఇక్కడ కూడా కాపీ కొట్టారని ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించారు. రామాయణంలో ఖవ్వాలీ ఏంటని, రెహమాన్ మైండ్ పోయిందా అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ‘రాక్‌స్టార్’, ‘జోధా అక్బర్’ సినిమాల్లోని ‘కున్ ఫయా కున్’ పాటను తలపిస్తోందని, రెహమాన్ తన పాత హోమ్‌వర్కునే మళ్లీ మళ్లీ రీసైకిల్ చేస్తున్నారని మరికొందరు విమర్శలు గుప్పించారు. కాగా.. “కున్ ఫయా కున్” (Kun Faya Kun) అనేది అరబిక్ పదం. ఇస్లామిక్ పవిత్ర గ్రంథం ఖురాన్‌లోని పలు సందర్భాలలో ఈ పదం కనిపిస్తుంది. ఇక, రామాయణ చిత్రానికి అజయ్-అతుల్ లేదా శంకర్-ఎహసాన్-లాయ్ (Shankar-Ehsaan-Loy) అయితే సరైన న్యాయం చేసేవారని అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రంలో కేవలం ఈ పాట మాత్రమే కాకుండా, రెహమాన్ అందించిన మ్యూజిక్ మొత్తం నిరాశపరిచిందని కొందరు కామెంట్స్ చేశారు. సంస్కృత సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే పాటలను ఉపయోగిస్తే వంద రెట్లు బాగుండేదని, రామాయణం బీజీఎం మినహా మిగతా పాటలన్నీ యావరేజ్‌గానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో పాటల విషయంలో వచ్చిన ఈ నెగెటివిటీ సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.