NTV Telugu Site icon

Cylinder Blast: పెళ్లిలో పేలిన సిలిండర్.. 32మంది మృతి

Cylinder Blast

Cylinder Blast

Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. మరో నలుగురు వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం

సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది.

Read Also: Heavy Drug Seizure: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత

‘రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన సంఘటన జరిగింది. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, సంఘటనా స్థలానికి వెళ్లకుండా, రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ, అవమానానికి గురిచేస్తోందని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తూ, బిజెపి నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ అన్నారు. అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత రాథోడ్ జోధ్‌పూర్ చేరుకుని ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి మార్చురీ వెలుపల నిరసన తెలుపుతున్న కొందరిని కలిశారు. ఆ సంస్థ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి పరిహారం ప్రకటించలేదన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి గ్యాస్‌ కంపెనీ నుంచి రూ. కోటి పరిహారం, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాథోడ్ స్వయంగా బాధితుల కోసం రూ.11 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది.

Show comments