కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భజన్‌లాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్‌లో ఉన్న 25 లోక్‌సభ సీట్లను బీజేపీనే గెలుచుకుంటుందని భజన్‌లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి మోడీ దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీలో ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న ఆలోచనతోనే ప్రతిపక్షాలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని.. అయినా మునుగుతున్న పడవలో ఎవరైనా కూర్చుంటారా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ మొత్తం 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 25 స్థానాల్లో కేవలం గెలువడమే కాదు.. భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలను గెలుస్తుందని భజన్‌లాల్ చెప్పుకొచ్చారు.
మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు కట్టబెట్టాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా సౌతిండియాపై దృష్టి పెట్టిన మోడీ.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసమే ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
