NTV Telugu Site icon

Rajasthan CM: బీహార్‌ తరహాలో కులాల సర్వే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన

Ashok Gehlot

Ashok Gehlot

Rajasthan Chief Minister Announces Caste Survey Ahead Of State Elections: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. జైపూర్‌లోని పార్టీ వార్‌రూమ్‌లో శుక్రవారం జరిగిన రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఆర్‌పీసీసీ) కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అశోక్ గెహ్లాట్‌తో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ రాంధావా, ఆర్‌పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Also Read: PM Modi Speech: ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధాని మోడీ సమీక్ష

రాజస్థాన్ ప్రభుత్వం కూడా బీహార్‌లో జరిగిన తరహాలో కులాల సర్వే నిర్వహిస్తుందని గెహ్లాట్ సమావేశం అనంతరం శుక్రవారం విలేకరులతో అన్నారు. కులాల సర్వే, జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కాన్సెప్ట్‌ను రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. పార్టీ ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ప్రకటించాలని తాము నిర్ణయించుకున్నామని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు. ‘‘దేశంలో రకరకాల కులాలున్నాయి.. రకరకాల మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు, వివిధ కులాలవారు రకరకాలుగా ఉద్యోగాలు చేస్తుంటారు. ఏ కులాల జనాభా ఎంత ఉందో తెలుసుకుంటే వారి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో తెలుసుకోవచ్చు. కులాల వారీగా పథకాలను సిద్ధం చేయడం మాకు సులభం అవుతుంది.” అని ఆయన అన్నారు.

Also Read: Israel-Palestine Conflict: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం ఏంటీ.. ఎందుకీ హింస..?

ఈ సమావేశంలో కుల ఆధారిత సర్వేతో పాటు తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్‌సీపీ) అంశంపై యాత్రపై చర్చలు కూడా జరిగాయని రాంధావా చెప్పారు. అంతకుముందు, 13 జిల్లాల సాగునీరు మరియు తాగునీటి అవసరాలను తీర్చగల తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కోసం జాతీయ ప్రాజెక్ట్ హోదాను డిమాండ్ చేయడానికి కాంగ్రెస్ తూర్పు రాజస్థాన్‌లో ఐదు రోజుల యాత్రను చేపట్టాలని ప్రణాళిక వేసింది. అయితే పార్టీ వాయిదా వేసింది.

రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోతస్రా శుక్రవారం మాట్లాడుతూ.. సోమవారం కీలక సమావేశం జరుగుతుందని, ఇందులో తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ సమస్యపై యాత్ర తేదీలు నిర్ణయించబడతాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ‘కామ్ కియా దిల్ సే, కాంగ్రెస్ ఫిర్ సే’ అనే నినాదం ఉంటుందని ఆయన తెలిపారు.2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా అంతకు ముందు జరుగుతాయని భావిస్తున్నారు.