NTV Telugu Site icon

MP Margani Bharat: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ

Margani Bharat

Margani Bharat

MP Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని‌ స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని‌ అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద భరత్ మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకు రాగా ఈ విధంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ ఒకటేనని.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలని, అందుకోసం ప్రజల మనసు గెలుచుకోవాలని పదేపదే చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read Also: CM YS Jagan: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు.. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

‘వై నాట్ 175’ గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయింపులు చేస్తున్నారని..అలాగని టికెట్ ఇవ్వని సిట్టింగులకు అన్యాయం జరగదన్నారు. రేపు అధికారంలోకి రాగానే ఎవరైతే పార్టీ విజయానికి కృషి చేశారో వారందరికీ తగిన విధంగా గుర్తించి గౌరవిస్తారని చెప్పారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తదితర వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలన్నారు. ఏ నియోజకవర్గానికీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయలేదని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయించారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఎంపీ భరత్ అన్నారు.