ఇంద్రధనుస్సు.. పేరు చెప్పగానే మనకు బాల్యం గుర్తుకు వస్తుంది.. వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు కనువిందు చేస్తుంటుంది. ఆఅద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోతుంటాం. అలాంటిదే తూర్పుగోదావరి జిల్లా కడియం పరిసర ప్రాంతాల వారికి కలిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల-మడికి రోడ్డులో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీటితో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒకపక్క వర్షం.. ఆవెంటనే ఎండతో వాతావరణంలో మార్పులు కనిపించాయి. ఇందులో భాగంగా ఒకపక్క వర్షం కురుస్తుండగా ఎండ రావటంతో ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడింది. దీనిని చూసిన కొందరు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని వీడియోలు తీశారు. వర్షాకాలంలో గోదావరి బ్రిడ్జిపై ఇలాంటి అద్భుతమయిన దృశ్యాలు నేత్రానందం కలిగిస్తూనే వుంటాయి. అందునా పచ్చదనం నిండిన గోదావరి ప్రాంతంలో ఒకవైపు పంటలు, పచ్చిక బయళ్ళు, కొబ్బరి చెట్లతో రమణీయంగా వుంటుంది. అందునా అక్కడ ఇంద్రధనుస్సు కనిపిస్తే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి..