తెలంగాణను వర్షాలు వీడటం లేదు. ఓ వైపు ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాల రూపంలో కొంత ఉపశమనం కలిగినా.. రైతులు మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అయితే.. ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. నిజామాబాద్‌లోని సిరికొండలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతోపాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పెట్టులో వడగళ్ల వాన పడింది. సిరికొండ, జుక్కల్ నియోజవర్గాల్లో వడగండ్ల వానకు పంటలు నాశనమయ్యాయి. వరి చేలు నేలకు ఒరిగాయి. వడ్లు రాలిపోయాయి. పంట కోసం కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. దీంతో ఆరుగాలం కష్టపడిన పండించి నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తమను నిండా ముంచేసిందని, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Kerala: పోకిరి ఏనుగు “అరికొంబన్” చిక్కింది.. అధికారుల ఆపరేషన్ సక్సెస్..
ఇదిలా ఉంటే.. వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం గంటకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : CSK vs PBKS: దంచికొడుతున్న సీఎస్కే బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
