NTV Telugu Site icon

Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం

Adilabad Rains

Adilabad Rains

Adilabad Rains: భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్ అర్బన్‌లో 22.8 మిమీ వర్షపాతం నమోదు కాగా.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి లో 9 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ఎడ్‌బిడ్‌లో 7.3 మి.మీ. వర్షం కురిసింది. ఉగాది పండుగకు చల్లటి వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు కాస్త ఎండనుంచి ఊరట లభించిందనే చెప్పాలి. మరి ఈ రెండు రోజులు చిరుజల్లులతో నేల తడియడంతో రైతులకు కూడా ఇది శుభవార్తే అని చెప్పాలి.

Read Also: Srisailam Temple: శ్రీశైలంలో నేటితో ముగియనున్న ఉగాది మహోత్సవాలు

గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిప్పులు చెరుగుతున్న ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నడూ లేని విధంగా 44 డిగ్రీలకు చేరువ కావడం, వడగాలుల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రానున్న రెండు రోజుల పాటు ఎండల తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో జిల్లావాసులకు ఊరట లభించింది. రానున్న రెండు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని సమాచారం. దీంతో గత వారం రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జిల్లా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.