Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..

  • నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన రాహుల్ గాంధీ..
  • విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్..
  • దేశంలో 88 పేపర్ లీక్స్ జరిగాయని ఆరోపణ..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేపర్ లీక్‌లు దేశ విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, లక్షలాదాది మంది యువత భవిష్యయత్తును ప్రమాదంలో పడేశారని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, కృషి వృధా అయిందని రాహుల్ గాంధీ అన్నారు. పేపర్ లీక్ వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రం ఆగ్రహంతో ఉన్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు.

దేశంలో ఇప్పటి వరకు 88 పేపర్ లీక్స్ జరిగాయని, సుమారు 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆయన అన్నారు. కేవలం ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, విద్యా వ్యవస్థలో ఒక విస్తృతమైన నెట్వర్క్ ఫలితమే అని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని విద్యావ్యవస్థలో నియమించడం విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారని అన్నారు.

ఆర్ఎస్ఎస్-బీజేపీ విద్యావ్యవస్థను నావనం చేసిందని, విద్యా వ్యవస్థ కేవలం డబ్బు సంపాదించే సాధనంగా మారిందని అన్నారు. పేపర్ లీక్‌లో ప్రవేయం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. పదే పదే జరుగుతున్న పేపర్ లీక్స్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.