Rahul Dravid Talks about WTC Title With Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగానే రాహుల్ ద్రవిడ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చి.. ఆటగాళ్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ గెలవకున్నా.. కోచ్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవ చేస్తున్న ‘ది వాల్’.. కోచ్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా కోచ్‌గా అతడి బాధ్యతలు ముగిశాయి. ద్రవిడ్ పోతూ పోతూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు.
టెస్టుల్లోనూ భారత జట్టును ఛాంపియన్‌గా నిలవాలని విరాట్ కోహ్లీతో రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ‘తెల్ల బంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే మిగిలి ఉంది. అది కూడా సాధించండి’ అని డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా విరాట్ ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మాత్రమే. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా గెలవాలి కోహ్లీకి టార్గెట్ ఇచ్చాడు.
Also Read: Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ రీఛార్జిపై రూ.600 ఆదా.. నేడే ఆఖరి గడువు!
భారత జట్టు 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. 2021 ఫైనల్స్‌లో న్యూజీలాండ్ జట్టుపై, 2023 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. ఈసారి కూడా ఫైనల్స్‌కు చేరాలనే లక్ష్యంతో భారత్ ఆడుతోంది. 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఉన్నది. ఈ సారి కూడా ఫైనల్స్ చేరితే.. హ్యాట్రిక్ కొడుతుంది. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచాక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.