Director Krish on Gachibowli Radisson Hotel Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసులకు తెలిపారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఉండడం విశేషం.
రాడిసన్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ చెప్పారు. అయితే అతడు కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో ఉన్న క్రిష్.. తాను విచారణకు హాజరవుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముంబైలో ఉన్నందున తాను శుక్రవారం విచారణకు హాజరవుతానని గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు వచ్చాక ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: CPI Narayana: ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!
రాడిసన్ హోటల్‌లో పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల నంబర్స్ ఉన్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో అబ్బాస్ అలీతో పలువురు చాటింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. గతంలో అబ్బాస్ అలీ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశాడు. రాడిసన్ హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అతడు తన వాంగ్మూలంలో తెలిపాడు. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.