Posani Krishna Murali: తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్‌మీట్‌లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్‌గా ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు. జగన్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి మీడియా సమావేశాలు పెడుతున్నానన్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అవునా? కాదా? టెస్ట్ చేయాలన్నారు. ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన చంద్రబాబు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల్లో ఉండి మా వాడు గెలువాలి.. మీ కులపోడు గెలవాలి అనడం కరెక్ట్ కాదన్నారు. ప్రెస్‌మీట్‌లు పెడితే తప్పా?.. ప్రజల కోసం నిజాలు చెబితే తప్పా? అని ప్రశ్నించారు. నేనేమైనా పాకిస్తాన్ వాడినా? అమెరికా వాడినా? ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టకూడదన్నారు. దాసరి నారాయణ ఒక సందర్భంలో అప్పుల పాలయ్యాడని.. ఆయననే పరిశ్రమలో ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు.
Read Also: QuestionHour With Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళితో క్వశ్చన్ అవర్
ఒక వ్యక్తి ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడే ప్రెస్‌మీట్ పెడతానన్నారు. ఎవరిని తిట్టడం లేదు.. ప్రజలకు గుర్తు చేస్తున్నానన్నారు. ఒక చంద్రబాబు లాంటి వ్యక్తి వల్ల సమాజం పాడైపోతుందన్నారు. ఎక్కడికైనా ప్రచారం చేయడానికి వెళ్తానన్నారు. ప్రచారం చేయడానికి పిఠాపురానికి వెళ్లేందుకు సిద్ధమన్నారు. ప్రచారం చేయాలని కోరితే వంద శాతం వెళ్తానన్నారు. ప్రెస్‌మీట్ పెట్టాలని ఎవరూ, ఎప్పుడూ తనకు చెప్పరన్నారు. ఏదైనా అవసరం అయితేనే ప్రెస్‌మీట్ పెడతానన్నారు. తాను ఓడిపోయినప్పుడు కూడా జగన్ వైపే ఉన్నానన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారలేదనన్నారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లలో ఉత్తమమైన నేతలకే మద్దతు ఇస్తానని పోసాని పేర్కొన్నారు. మంచిగా ఉంటే ఎవరినీ తిట్టనని.. చెడు చేస్తే ఎవరినైనా అనకుండా ఉండనన్నారు. పవన్ కల్యాణ్‌ను విభేదించిన మాత్రానా సినిమాలు పోయాయా అంటూ పోసాని అన్నారు. తెలుగు సినిమా మొత్తం మెగా ఫ్యామిలీ మాత్రమే ఉందా అంటూ ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ ప్రభావం ఉంటే మా అధ్యక్షులుగా మోహన్ బాబు కొడుకు ఎందుకు గెలిచాడన్నారు. మెగా ఫ్యామిలీకి ప్రజల మద్దతు ఉంటే వాళ్ల గెలవాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో గుత్తాధిపత్యం ఉందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమను, కష్టాన్ని నమ్ముకున్నానని ఆయన తెలిపారు. నాలో భాషా, భావం ఉంది కాబట్టే పరిశ్రమలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నానన్నారు.