Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. స్పష్టం చేసిన భారత్

  • పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ దేశాలు పని చేస్తాయి
  • స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
Quad Foreign Ministers

Quad Foreign Ministers

భారత్ అధ్యక్షతన ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు భేటీ అయ్యాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఉగ్రవాద నిరోధక చర్యలు కీలక అంశంగా చర్చకు వచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు కాకనూర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ముఖ్యంగా సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని క్వాడ్ దేశాలు తీవ్రంగా ఖండించినట్లు వెల్లడించారు.

క్వాడ్ సంయుక్త ప్రకటనలో 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు, వాటికి ఆర్థిక సహాయం అందించే వర్గాలు, మద్దతుదారులపై అంతర్జాతీయ సమాజం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని విదేశాంగ మంత్రులు మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమన్వయంతో పనిచేయడం, గ్లోబల్ స్థాయిలో భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడం అవసరమని క్వాడ్ దేశాలు అభిప్రాయపడ్డాయని వెల్లడించారు.

అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంత సముద్ర భద్రత, సముద్ర మార్గాల బలోపేతంపై కీలక చర్చలు జరిగాయని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, నిరంతర వాణిజ్య రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని విదేశాంగ మంత్రులు ప్రాధాన్యంగా ప్రస్తావించినట్లు వివరించారు. ఇండో-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ (IPMDA) కింద క్వాడ్ సహకారాన్ని మరింత విస్తరించినట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతమంతటా సమగ్ర సముద్ర కార్యకలాపాల పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా క్వాడ్ దేశాలు ‘ఇండో-పసిఫిక్ మారిటైమ్ సర్వైలెన్స్ కలాబరేషన్’ (IPMSC) అనే కొత్త వ్యవస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. సముద్ర నిఘా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతల సమన్వయంతో ఈ IPMSC వ్యవస్థ పనిచేస్తుందని.. దీని ద్వారా IPMDA సామర్థ్యాలు మరింత పెరుగుతాయని నాగరాజ్ నాయుడు కాకనూర్ తెలిపారు. రియల్‌టైమ్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, సముద్రంలో సంచరించే నౌకల కదలికలపై మరింత స్పష్టమైన సమాచారాన్ని అందించడంలో ఇది కీలకంగా మారనుందని చెప్పారు.

అలాగే కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ను కూడా ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా కీలక ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయని చెప్పారు. విశ్వసనీయ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక తయారీ రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు మద్దతు అందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచుతూ పెట్టుబడుల సౌలభ్యం, నియంత్రణ విధానాలు, రీసైక్లింగ్ సాంకేతికతలు, బలమైన సరఫరా వ్యవస్థలపై సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు క్వాడ్ దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఇక సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా, అంతరాయం లేని వాణిజ్యం, నావికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు స్పష్టం చేసినట్లు నాగరాజ్ నాయుడు కాకనూర్ వెల్లడించారు.