ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
పీవీ సింధు తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశంలోని అత్యంత ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులను సింధు ఆహ్వానించారు. తెలుగు సంప్రదాయబద్ధంగా, రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబించేలా జరిగిన పెళ్లికి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో సింధు, సాయిల రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
Also Read: Champions Trophy 2025: దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లు.. భారత్ అర్హత సాధించకపోతే..!
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయసాగర్‌లో పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి జరిగింది. ఇది ఓ దీవి. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవి 21 ఎకరాల్లో ఉంటుంది. రఫల్ సంస్థ ఈ దీవిని అద్భుతంగా తీర్చిదిద్దింది. దీవి మధ్యలో ఉండే భారీ రిసార్ట్‌లో గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ దీవికి వెళ్లడానికి పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీవి చుట్టూ ఉన్న సరస్సులో పడవల్లో వెళుతుంటే ప్రత్యేక అనుభూతిని పొందుతారు. రిసార్టులో ఒక గదికి ఒక రోజుకు ఒక లక్ష అద్దె ఛార్జ్ చేస్తారు. వధూవరుల సంప్రదాయాలకు తగ్గట్టుగా రిసార్టును రూపొందిస్తారు.