నేడు స్థిత ప్రజ్ఞుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషాకోవిదుడి పేరుగాంచిన భారతదేశ పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు 101వ జయంతి జయంతి. పి.వి. నర్సింహారావు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో జన్మించారు. నర్సింహారావు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగి.. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్నో అత్యున్నత పదవులను అధిష్టించారు. కానీ.. అప్పటిపరిస్థిల్లో ఈ దేశంలో సామాన్యుడు గద్దెనెక్కడం అనేది అంతా ఓ భ్రమ. పేరుకు ప్రజాస్వామ్య దేశమే అయినా, రాచరికాన్ని తలపించేలా పాలన మొత్తం తరతరాలుగా ఏదో ఒక్క కుటుంబం చేతిలోనే ఉంటుందనేది భారతీయులందరికీ తెలిసిన సత్యం. అయితే అటువంటి ఆనవాయితీని ఛేదిస్తూ, 1991వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దక్షిణ భారత దేశం నుంచి ఒకవ్యక్తి, అందులోనూ తెలుగు వాడు అయిన పీవీ నరసింహారావు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కానీ.. ఆ సమయం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి, పేదరికం పెరిగిపోయి, అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో దిక్కుతోచని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన పీవీ తనదైన ఆలోచనలతో, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థికవ్యవస్థను ఒకగాడిలోకి తీసుకురావడమే కాకుండా.. ప్రజల్లో ఆర్థిక భద్రత, ఒక నమ్మకం కల్పించడంలో పీవీ ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన్ను ఆర్థిక సంస్కరణల జాతిపితగా కీర్తి గడించారు పీవీ నరసింహా రావు. అంతేకాదు..గొప్పవ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరు. ఎంతటి ప్రత్యర్థులనైనా తన రాజకీయ చాణక్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించగల నేర్పరి. మంచి రాజనీతిజ్ఞుడిగా కూడా పేరు, ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా నెంబర్ వన్ ప్రధానమంత్రిగా ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి పీవీ నరసింమరావు.
అంతేకాదు.. పీవీ నర్సింహారావుకు అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. తెలుగు, ఉర్దూ, అరబిక్, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, తమిళం, సంస్కృతంలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్ మరియు పర్షియన్ లాంటి విదేశీ భాషలలో మంచి పట్టు ఉండేది. అంటే.. మొత్తంగా 17 భాషలలో అనర్గళంగా ప్రసంగించేవారు పీ.వీ. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించి ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు. కాగా.. రాజకీయంలో పీవీ అపర చాణక్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగానే కాకుండా.. దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ పాలన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. వివిధ దేశాధినేతలను సైతం పీవీకి అభిమానులుగా చేసింది. అంతటి గొప్ప మనిషిని మనం ఆయన జయంతి సందర్బంగా స్మరించుకుందాం.