Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!

Pulivarthi Sudha Reddy Vs Chevireddy

Pulivarthi Sudha Reddy Vs Chevireddy

Pulivarthi Sudha Reddy Warns Chevireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి రూరల్‌ ప్రాంతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టొద్దని, అనవసరంగా గొడవలు సృష్టించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా అని, అప్పుడే ఎలాంటి గొడవలు జరగవు అని సుధా రెడ్డి అన్నారు.

వైసీపీ అభ్యర్థికి జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం మంగళం ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని చెవిరెడ్డి అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు టీడీపీ అభ్యర్థికి జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న పులివర్తి సుధా రెడ్డి.. చెవిరెడ్డి ఉన్న పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్‌ను సుధారెడ్డి తన వాహనంతో వెంబడించారు. ఉదయం నుంచి చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే.. సుధా రెడ్డి అటే వెళ్లడం గమనార్హం.

ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి పులివర్తి సుధా రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ‘నేను ఎస్కార్ట్‌.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెంటే ఉంటా. ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా. నిన్ను ఒంటరిగా వదిలేస్తే గొడవలు చేస్తావ్‌. నాన్సెన్స్‌ క్రియేట్‌ చేస్తే నీకు, నాకు డైరెక్ట్‌ ఉద్యమమే’ అంటూ చెవిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తిరుపతి రూరల్‌ ప్రాంతంలో ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సుధా రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.