ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్‌లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ఏం చేసిన కొందరి తీరు మాత్రం మారడం లేదు.
READ MORE: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం… 600 ఫోన్లు ఒక్కరోజే టాప్!
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల తీరు మాత్రం అస్సలు మారడం లేదు. వాళ్లు మాత్రం తమ పిల్లలను ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు.. బడి బాట లాంటి కార్యక్రమాల్లో మాత్రం సాధారణ ప్రజల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని నినాదాలు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇప్పటికీ సర్కారు పాఠశాలలపై నమ్మకం కలగడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి.. కానీ ప్రభుత్వం బడి వద్దా? అంటూ నిలదీస్తున్నారు. కానీ ఆయా ఉపాధ్యాయులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. మొదట ఈ టీచర్ల తీరులో మార్పు రావాలని యువకులు కోరుతున్నారు. మీరే ప్రభుత్వ పాఠశాలలను విశ్వసించకుంటే.. సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రైవేటు శక్తులు విద్యను వ్యాపారంలా మార్చేశాయి. మధ్యతరగతి కుటుంబం ఇద్దరు పిల్లలను కూడా ప్రైవేటు బడుల్లో చదివించలేకపోతోంది. జీతం కంటే పాఠశాలల ఫీజులే అధికమవుతున్నాయి. అయినా తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడుతూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో కొత్తగా ఆరుగురు నిందితులు.. చెవిరెడ్డి అరెస్ట్..?
సర్కారు బడులు రాను రాను మారుతున్నాయి. ఇటీవల రేవంత్ ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ.. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో ఇటీవల పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు కల్పించనుంది.
ఆ ఆరు సంస్థలు ఇవే..
నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్‌స్టెప్ ఫౌండేషన్: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంతో 540 పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో ఐదు వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు తన సేవలు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు గణితంలో ప్రాథమికాంశాలను ఈ సంస్థ బోధిస్తుంది.
ఫిజిక్స్ వాలా: ఇంటర్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్యాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది.
ఖాన్ అకాడమీ: రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది.
ప్రజ్వల ఫౌండేషన్: 6-12వ తరగతి వరకూ విద్యార్థులకు బాలసురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.
పైజామ్ ఫౌండేషన్.. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యుటేషనల్ థింకింగ్‌పై శిక్షణ ఇస్తుంది.
ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ: రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేల మందికి పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు.. బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది.