Priyanka Chopra: ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశీ అమ్మాయిగా ఉన్న ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారింది. ఆమె హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది. కానీ.. ఈ స్థాయికి చేరిన ప్రియాంక ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. తన కెరీర్‌లో జరిగిన విషయాలను తాజాగా ప్రియాంక పంచుకుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా గడ్డు కాలాలు ఉన్నాయి. అయితే.. పని పట్ల ఆమెకున్న మక్కువ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది.
READ MORE: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
మంగళవారం అబుదాబిలో జరిగిన బ్రిడ్జ్ సమ్మిట్ 2025 లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. పరిశ్రమలో తన తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టకాలాల గురించి తెలిపింది. హాలీవుడ్‌లో తనకు తొలి పెద్ద బ్రేక్ వచ్చే ముందు తాను చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. “నా జీవితంలో ఒక దశలో నేను ఏడాదికి ఆరు సినిమాలు చేశాను. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. అకస్మాత్తుగా నేను చేయాలనుకున్న సినిమాల్లో వేరే వాళ్లను తీసుకున్నారు. నన్ను అనేక సార్లు పక్కన పెట్టేశారు. అప్పట్లో సినిమాల్లో నా మనుగడపై సందిగ్ధత నెలకొంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించేదాన్ని. నా కెరీర్ ప్రారంభంలో నచ్చిన చిత్రాలను ఎంచుకునే స్వేచ్ఛ లేదు. ఏ చిత్రనిర్మాతలకు నో చెప్పే లగ్జరీ నాకు లేదు. అప్పట్లో సినిమాలు దొరకడం కష్టం. ప్రతి అవకాశాన్ని అంగీకరించాను. కొన్ని సార్లు కుటుంబానికి సైతం దూరంగా ఉన్నాను. నేడు నా త్యాగాలు ఫలించాయని భావిస్తున్నాను.” అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది.
