దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నియమించడంపై దేశవాళీ దిగ్గజ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో 15 ఏళ్ల వైభవ్‌కు కీలక బాధ్యత అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న కొద్ది రోజులకే అతనికి ఈ పదవి దక్కింది. యువ ఆటగాడిని నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు స్పష్టం చేసినప్పటికీ, పాంచల్ మాత్రం దీనితో విభేదించాడు.
ఈ నిర్ణయాన్ని జోనల్ సెలెక్టర్లు నివారించి ఉంటే బాగుండేదని, ఇది వైభవ్‌పై అనవసరమైన ఒత్తిడి తెస్తుందని పాంచల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డాడు. బీహార్ తరఫున ఇప్పటివరకు కేవలం 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ యువ సంచలనం, ముందుగా రెడ్ బాల్ క్రికెట్ శైలిని, వాతావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. నాయకత్వ బాధ్యతలు అప్పగించే ముందు అతనికి ఆటపై పూర్తి అవగాహన రావడానికి సమయం ఇవ్వాలని సూచించాడు. వీలుంటే అతడిని ఆ బాధ్యత నుంచి తొలగించాలన్నాడు.
మరోవైపు.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన సందర్భంలో వైభవ్ సూర్యవంశీని ప్రశంసించడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్‌ను అధిగమించి టి20ల్లో అగ్రస్థానానికి చేరుకున్న బట్లర్, భవిష్యత్తులో తన రికార్డును బద్దలు కొట్టే సత్తా బహుశా వైభవ్ సూర్యవంశీకి మాత్రమే ఉందని కొనియాడాడు. టి20ల్లో అత్యుత్తమ ఘనత సాధించినందుకు తనకు గర్వంగా ఉందని, అయితే ఒకరోజు ఈ రికార్డును వైభవ్ అధిగమిస్తాడని తాను భావిస్తున్నట్లు బట్లర్ వ్యాఖ్యానించాడు. ఇలా ఒకవైపు సీనియర్ ఆటగాడు పాంచల్ అతనిపై ఒత్తిడి పడకూడదని ఆందోళన చెందుతుంటే, మరోవైపు ప్రపంచ స్థాయి ప్లేయర్ బట్లర్ అతని ప్రతిభపై ధీమా వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

