మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాన్ని మరింత పటిష్ఠంగా, కఠినతరం చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు మహారాష్ట్ర జల్గావ్‌లోని లఖపతి దీదీ సదస్సులో ఏర్పాటు చేసిన సభకు మోడీ హాజరై ప్రసంగించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో జనాల ఆగ్రహావేశాల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
నేరస్థులను వదిలిపెట్టబోమని.. వారిని రక్షించే వారిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ‘ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పోలీసు శాఖలు ఇలా ఎవరి ప్రమేయం ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉంటాయి. ముందు మహిళలను మనం కాపాడుకోవాలి. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించి మహిళల కోసం కొత్త నిబంధనలను రూపొందించాం. ఈ రోజు నేను దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి మరోసారి చెబుతున్నాను. మహిళలపై నేరం క్షమించరాని పాపమని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి. దోషి ఎవరైనప్పటికీ, అతన్ని విడిచిపెట్టకూడదు. దోషికి సాయం చేసే వారిని వదిలి పెట్టం. ఆసుపత్రి, పాఠశాల, కార్యాలయం లేదా పోలీసు వ్యవస్థ ఏదైనా.. ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా అన్నింటినీ లెక్కిస్తాం.” అని ప్రధాని హెచ్చరించారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందిస్తున్నాం. గతంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. బీఎన్‌ఎస్ లో అనేక సవరణలు చేశాం. మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్లకూడదనుకుంటే, ఆమె ఇ-ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయవచ్చు. ఇ-ఎఫ్‌ఐఆర్‌ను ఎవరూ మార్చలేరు. ప్రస్తుతం బీఎన్ఎస్ లో సవరణలు చేశాం. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అండగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు.
