Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఓ యువకుడు చేసిన హడావుడి కాసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తూ కాన్వాయ్ వైపు యువకుడు దూసుకురావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.

రాష్ట్రపతి కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం నిర్వహించిన హోటల్ సమీపంలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా రాష్ట్రపతి కాన్వాయ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఆ యువకుడు విశాఖలోని జాలారిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అతడు కాన్వాయ్ వైపు ఎందుకు వెళ్లాడు.? ఉద్దేశం ఏమిటి.? అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం జరిగిన ప్రాంతం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా యువకుడు కాన్వాయ్ వైపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అయితే భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొన్నప్పటికీ పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. దీంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి చర్య వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.? లేదా.? మానసిక పరిస్థితి కారణంగానే ఇలా ప్రవర్తించాడా.? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.