NTV Telugu Site icon

T20 World Cup 24: రాహుల్, గిల్‌లకు నో ప్లేస్.. కీపర్‌గా సంజూ! భారత జట్టు ఇదే

Team India

Team India

Team India Squad for T20 World Cup 24: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో నెలరోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమై జట్టు ఎంపికపై చర్చలు చేసింది. వచ్చే కొన్ని గంటల్లో ఎప్పుడైనా బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును వెల్లడించనుంది.

ఇప్పటికే మాజీలు టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అయితే ప్రముఖ క్రికెట్ వెబ్‌‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తమ కథనంలో మెగా టోర్నీ గురించి కీలక సమాచారం పేర్కొంది. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఐపీఎల్ 2024 ఫామ్‌ను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారట. టాపార్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదట.

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌, తెలుగు తేజం తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించినట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌లుగా సంజూ శాంసన్, రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారట. అయితే ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా సంజూను పరిగణించనున్నారని తెలుస్తోంది. స్పెషలిస్ట్ ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎంపికైనట్లు సమాచారం. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబేలు జట్టులో ఉంటారట. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు.. యుజ్వేంద్ర చహల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా ఎంపిక కాగా.. మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌లకు సైతం అవకాశం దక్కనుందట.

Also Read: Krishnamma : “కృష్ణమ్మ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. అతిధులుగా రానున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్..?

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్.