ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణ జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. కాళేశ్వరం కంటే ధరణి కుంభకోణం పెద్దదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ చేసి అతిపెద్ద మోసం ఇది. లక్షలమంది రైతులు అని, ధరణి కారణంగా తమ విలువైన భూమిని కోల్పోయారన్నారు ప్రకాష్ జవదేకర్. కానీ ప్రభుత్వం ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని, గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా.. గ్రామాల్లోని భూరికార్డులను ప్రభుత్వం తీసేసుకుని ఎవరికీ ఈ రికార్డులు అందకుండా చేశారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి.. పట్టేదార్, పొసెషన్ (అనుభవదారు)ల స్థానంలో.. బినామీ, అక్రమంగా చొరబాటుదారు అని పేర్లు చేర్చారు. కేంద్ర ప్రభుత్వం, NIC రూపొందించిన కంప్యూటరైజ్డ్ సాఫ్ట్‌వేర్.. అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలే.. ఈ భూ రికార్డులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై (అప్‌డేట్) చేసుకునేందుకు వీలుంటుంది. మొదట్లో ఈ రికార్డులను ఆధునీకరించే ప్రక్రియను TCS కంపెనీకి అప్పగించారు. మొదటి 3 నెలలు ఈ రికార్డులను పద్ధతిగా నిర్వహించిన TCS కంపెనీ.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విధులనుంచి తప్పుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వం కోరినట్లుగా TCS పనిచేయనందునే తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. టీసీఎస్ కంపెనీ ఈ భాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత.. ILFS అనే మరో కంపెనీకి అప్పజెప్పారు. ఆ కంపెనీ కూడా దివాళా తీసిన తర్వాత.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను టెర్రా CIS అనే మరో కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది.
ఈ టెర్రా CIS కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. వాస్తవమైన భూ రికార్డులను పూర్తిగా గందరగోళంగా చేసేసిన తర్వాత కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్ (వేస్&మీన్స్) ను తీసుకొచ్చారు. దీంతో భారీమొత్తంలో భూరికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ భూములు, ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, ఈడీ సీజ్ చేసిన భూములు, దేవాలయ భూములు, చెరువులు, కాందీశీకుల భూమి (ఎవాక్యూ ప్రాపర్టీ), పరిశ్రమల భూములు, భూదాన్ భూములు, ఎక్స్-సర్వీస్‌మెన్ భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, పైగా లాండ్స్, బ్లూబుక్ ల్యాండ్స్ పెద్దమొత్తంలో.. అవకతవకలు జరిగాయి. విశ్వసనీయ వర్గాలు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఓ విదేశీ కంపెనీ రూపొందించిన యాప్ (మొబైల్ అప్లికేషన్) ధరణి లోని డిజిటల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌ను పొందినట్లు (యాక్సెస్ చేసినట్లు) తెలుస్తోంది. వివిధ కోడ్ల సీక్వెన్షియల్ స్కానింగ్ ద్వారా ధరణి డేటాను పరిశీలించారని అర్తమవుతోంది. ప్రభుత్వ డేటాను ఓ ప్రయివేటు కంపనీ మైనింగ్ చేయడం (లోతుగా పరిశీలించడం) సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటాను ఓ ప్రైవేటు కంపెనీ మైనింగ్ చేసింది.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను ప్రస్తు రెవెన్యూ శాఖ ప్రాసెస్‌లో నుంచి తొలగించి దీన్ని ల్యాండ్ రికార్డుల్లోకి చేర్చారు. ప్రస్తుతం ఉన్న CARD సాఫ్ట్‌వేర్ కు బదులుగా.. ధరణి కి ఓ కొత్త సాఫ్ట్‌వేర్ ను డెవలప్ చేశారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రామసభలను నిర్వహించకుండా భూరికార్డుల ధృవీకరణ వ్యవస్థను తారుమారు చేశారు. దీని కారణంగా చాలా సర్వే నెంబర్లు మిస్ అయ్యాయి. కానీ ఈ సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటుచేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. 10 నుంచి 15 లక్షల నోషనల్ (పట్టాలేనివి) ఖాతాలు ఉన్నాయి. లక్షల ఎకరాలు ప్రొహిబిషన్ కింద చూపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. ధరణి భూ కుంభకోణాన్ని పూర్తిగా విచారణ జరుపుతాం. భూ యజమానులకు న్యాయం చేస్తాం. బీఆర్‌ఎస్ చెప్పిందే.. కరెక్ట్ అనేట్లు పరిస్థితి తయారైంది. అమిత్ షా గారు రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ధరణిమీద మేం విచారణ జరుపుతాం. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. కాళేశ్వరం, ధరణి రెండు భారీ కుంభకోణాలు.. దొంగ ప్రభుత్వమిది.. ప్రజలను మోసం చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఓటమి తప్పదు. బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.’ అని ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు.