Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..

  • ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా..
  • ‘కల్కి 2’ మేకింగ్ వీడియో విడుదల...
Kalki 2

Kalki 2

Kalki 2: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘కల్కి 2’ చిత్రబృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీంతో ‘కల్కి 2898 AD’ తర్వాత రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

‘కల్కి 2’ మేకింగ్ వీడియోలో ప్రభాస్ మరోసారి భైరవ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. తొలి భాగంలో భైరవగా ప్రభాస్ చేసిన యాక్షన్, ఆయన పాత్ర తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీక్వెల్‌లో ఈ పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఎలాంటి కీలక మలుపులు చోటుచేసుకోబోతున్నాయి? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం ప్రత్యేక సందేశాన్ని కూడా పంచుకుంది. ప్రతి తరంలో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్‌తో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ‘కల్కి 2’లోనూ కథ మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం. సినిమాలోని భవిష్యత్ ప్రపంచ సన్నివేశాలను మరింత పెంచడంతో పాటు, తొలి భాగంలో పరిచయమైన పాత్రల మధ్య సంబంధాలు, కథలోని కీలక అంశాలకు సీక్వెల్‌లో మరింత ప్రాధాన్యం ఉండనుందని అంచనాలు ఉన్నాయి.