Site icon NTV Telugu

Vizag KGH: కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు వీడిన గ్రహణం.. కానీ మహిళా పెషేంట్ మృతి!

Vizag Kgh

Vizag Kgh

ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్‌ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు.

ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డుతో పాటు చిన్నపిల్లల వార్డు, గైనిక్ వార్డులలోని పేషెంట్లు 10 గంటల పాటు నరకం చూశారు. వాష్ రూమ్లలో నీరు కూడా రాకపోవడంతో మహిళా పేషెంట్లు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో పేషంట్ల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కేజీహెచ్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

పిల్లల వార్డులో రోజులు నిండని పసికందులు గుక్క పెట్టి ఏడుస్తూ తల్లులను కంటతడి పెట్టించారు. విద్యుత్ కు అంతరాయం కలగడంతో పెద్ద ఆసుపత్రి మొత్తం చీకటిలో కూరుకుపోతే ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్టివల్లో మాత్రం విద్యుత్ కాంతులు విరజిల్లాయి. పేషెంట్లు నానా అవస్థలు పడుతుంటే పక్కనే ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాబోయే డాక్టర్లు చిందులు వేయడం తీర విమర్శలకు దారితీసింది.

Also Read: Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్‌ కప్‌ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!

అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవి అనే మహిళా పేషంట్ ఊపిరి అందక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో సిబ్బంది ఆక్సిజన్ పెట్టలేదని మండిపడ్డారు. ఆక్సిజన్ సరిపడా పెట్టుంటే ఆమె బతికి ఉండేదని వాపోయారు. పేషెంట్ మృతికి ఆసుపత్రి సిబ్బంది అధికారులు నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత విద్యుత్ పునరుద్దించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version