NTV Telugu Site icon

Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..

Thirumala

Thirumala

గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. శ్రీ మలయప్ప స్వామిని వజ్ర కవచం, కిరీటం.. ఇతర ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారు గరుడవాహనంపై ఆయనను అధిరోహించి.. ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు పాల్గొంటుండగా సేవకులు చత్రం, చామరాలను పట్టుకుని తిరుమల వీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Read Also: Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

గరుడ వాహనం ప్రాముఖ్యత
గరుడుడు వరాహ స్వామి ఆజ్ఞ ప్రకారం వెంకటాద్రి కొండను తీసుకువచ్చి తిరుపతి పక్కన ఉంచాడు. దీనిని ఇప్పుడు తిరుమల కొండలుగా పిలుస్తున్నారు. గరుడ పక్షి వేంకటేశ్వరుని వాహనం. కాగా.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.. ఈ సమయంలో జెండా (గరుడ చిహ్నం ఉంటుంది) ఎగురవేస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోను గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని చెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నాడని ఆలయ పండితులు చెబుతున్నారు.

మరోవైపు.. గరుడసేవ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించేందుకు శ్రీవారి ఆలయంలో పీఠాధిపతులను అలంకరించే అరుదైన ఆభరణాలను గర్భగుడి నుండి బయటకు తీసుకువస్తారు. అరుదైన ఆభరణాలతో శ్రీ మలయప్ప స్వామి.. గరుడుని భుజాలపై గంభీరంగా కూర్చొని, ఆయన నియమిత వాహనం అయిన మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించనున్నారు.