YSRCP: పల్నాడు జిల్లా మేమంతా సిద్ధం బస్సుయాత్రలో పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. ఈ రోజు పి.గన్నవరంకు చెందిన జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నియోజక ఇంచార్జ్ పోతిన మహేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వారితో పాటు పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. అందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
జనసేన టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పోతిన మహేష్.. జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన సంచలన ఆరోపణలు సైతం చేశారు.. రాజీనామా చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందని.. మాట తప్పని.. మడమతిప్పని నేతతో రాజకీయ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్న విషయం విదితమే కాగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్‌కి ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు పోతిన మహేష్..
ఇక, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి.. 2004, 2009 ఎన్నికల్లో పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.. కొద్దికాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.. అయితే, పాములు రాజేశ్వరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారు అమలాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్.. ఇక, వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
మరోవైపు, అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.. టీడీపీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించిన ఆయన.. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని సంప్రదించకుండా టికెట్లు కేటాయించడం దుర్మార్గం అన్నారు. తమ బాధలు.. జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి.