Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనుమతి ఇచ్చారు అని తెలిపారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నాం అని ప్రకటించారు.. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర కళాకారుల డేటా బేస్ తయారు చేస్తాం.. అవకాశాలు డైరెక్ట్‌గా అంది పుచ్చుకునే అవకాశం వస్తుందని వెల్లడించారు పోసాని కృష్ణమురళి.
ఇక, నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం.. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల క్యాటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయిన తెలిపారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. సెప్టెంబర్ 7-18 వరకు స్క్రూటినీ జరుగుతుందన్న ఆయన.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు అవార్డులను ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు పోసాని కృష్ణమురళి. రాష్ట్రంలో ఉన్న కళాకారులకు అండగా ఉంటామని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికీ ఐడీ కార్డులు ఇస్తామన్నారు. దానివల్ల బయటవారికి ఆర్టిస్టుల ఎంపిక సులభతరమవుతుంది. సినిమా రంగంలో మా అసోసియేషన్ ఉంది కానీ, మాలో మెంబర్ అవాలంటే డబ్బులివ్వాలన్నారు.. ఇతర అసోసియేషన్‌లోనూ డబ్బులు తీసుకుంటారు.. కానీ, ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమీషన్ తీసుకోబమని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఈ మధ్యే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం విదితమే.. ఆ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను ఎంపిక చేశారు.. దీనిపై స్పందించిన పోసాని.. బన్నీపై ప్రశంసలు కురిపించారు.. బన్నీ చాలా మంచివాడు.. నన్ను ఎంతో అభిమానిస్తాడు. ఓసారి నాకు రూ.5 లక్షలు ఇచ్చాడు. నాకెందుకిచ్చావని అడిగితే మీరు డబ్బు వృథా చేయరు, చాలామందికి గుండె ఆపరేషన్ చేయించారు, అది నాకు తెలుసు అని చెప్పాడని గుర్తుచేసుకున్నారు.. ఇక, మీరు మంచిపనికే ఉపయోగిస్తారు. అందుకే ఇచ్చానని చెప్పాడు. ఆ డబ్బును ఆర్థిక స్థోమత లేక చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు చెరో లక్షన్నర ఇచ్చాను. దాన్ని చదువుకోసం వాడమని చెప్పాను. మిగిలిన రూ.50 వేలను మళ్లీ ముగ్గురికి పంచేసి కొత్త బట్టలు కొనుక్కోమన్నాను. ఈ డబ్బులిచ్చింది అల్లు అర్జున్, ఆయనకు థ్యాంక్స్ చెప్పమని లైవ్‌లో పిల్లలతో థ్యాంక్స్ చెప్పించినట్టు బన్నీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు పోసాని కృష్ణ మురళి.