ప్రముఖ నటి, మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘అవును’, ‘సీమటపాకాయ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ, ఆ తర్వాత ‘అఖండ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2022 అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది.
Also Read : Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !
పెళ్లి తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చి, కొంత గ్యాప్ తీసుకున్న పూర్ణ.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లో కుర్చీ మడతపెట్టి.. స్పెషల్ సాంగ్‌తో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. అయితే పూర్ణ చిన్ననాటి నుంచి శాస్త్రీయ నృత్యకారిణి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీకి రాకముందు ‘సూపర్ డాన్సర్’ కాంపిటీషన్‌లో పాల్గొని పాపులర్ అయినప్పటికీ, నటిగా మారిన తర్వాత డాన్స్ ప్రదర్శనలకు దూరమైంది. తాజాగా, తన జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది అంటూ, తన తల్లి చెప్పిన మాట నిజమైందని ఎమోషనల్ పోస్ట్ చేసింది.
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడంతో, ఆ అనుభవాన్ని పంచుకుంటూ పూర్ణ తన భర్త గురించి కన్నీరు పెట్టుకుంది.. తన అనుభూతిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘‘మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను డ్యాన్సర్‌గా మారాను. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మా అమ్మ లాగా నా నృత్యానికి మద్దతు ఇచ్చే భాగస్వామిని ఇవ్వాలని దేవున్ని కోరుకున్నాను.. ‘నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి’ అని మా అమ్మ నన్ను ఆశీర్వదించింది. అటు అమ్మ కల, ఇటు నా కల భగవంతుడు నిజం చేశాడు. నా భర్త సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, నా నృత్యానికి మద్దతుగా నిలిచారు. కులం, నేపథ్యం తేడాలు పట్టించుకోకుండా, ఒక మనిషిగా, ప్రేమ, గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని’ అంటూ పూర్ణ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పూర్ణ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
