NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: సస్పెన్ష్‌కు తెరదించిన పొంగులేటి.. అమిత్‌ షా ఖమ్మం రాకముందే..!

Ponguleti

Ponguleti

Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీజేపీలో చేరతారా, కాంగ్రెస్‌లో చేరతారా అని రెండు నెలల పాటు ఊగిసలాట ధోరణి కనబర్చారు.. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో.. ఆ పార్టీవైపే మొగ్గు చూపారు. ఈ ఏడాది జనవరి 1న కేసీఆర్‌ సర్కార్‌పై పొంగులేటి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిరసన స్వరం పెంచారు. దీంతో ఆ పార్టీ పొంగులేటిని సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ చేశాక మరింతగా బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశారు పొంగులేటి. బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానీయకుండా చూడడం, కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్న పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్లను తాకనీయనంటూ శపథం కూడా చేశారు.

Read Also: Amit Sha Tour: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళి పలువురు ప్రముఖులతో భేటీ..!

ఇక, ఈటల రాజేందర్‌తో ఉన్న అనుబంధంతో తొలుత పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కొంతకాలానికి బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో కలిసి కొత్త పార్టీ పెడతారని టాక్ వినిపించింది. కానీ, కర్ణాటక ఫలితాల ప్రభావంతో క్రమంగా కాంగ్రెస్‌ వైపు చూపారు. సునీల్‌ కనుగోలు.. చర్చలు జరిపి పొంగులేటి కాంగ్రెస్‌ వైపు ఆకర్షించేలా చేయగలిగారు. పార్టీలో పొంగులేటికి మంచి పొజిషన్‌ ఇవ్వడమే కాకుండా, ఆయన అనుచరులకు సీట్లు ఇచ్చే విషయంలోనూ హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు పొంగులేటి. బుధవారం మంచి రోజు కావడంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Varahi Yatra: వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. అన్నవరానికి జనసేనాని

2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెల్చిన పొంగులేటి, ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా నాటి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటికి ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో.. అప్పట్నుంచి కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. గత నెలలో పొంగులేటిని పార్టీలో ఆహ్వానించడానికి ఆయన ఇంటికి బీజేపీ కీలక నేతలంతా వెళ్లారు. సో.. కాంగ్రెస్‌ నేతలు కూడా ఆ తరహాలోనే వెళ్లనున్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీసీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ ఆహ్వానించాక.. పొంగులేటి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యమంటున్న పొంగులేటి.. ఆయా నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు కోరుతున్నారు. మధిర, భద్రాచలం సిట్టింగ్‌ కాంగ్రెస్ సీట్లు తప్ప మిగిలిన సీట్లు అన్నీ తన వర్గం వారికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, సర్వేల ప్రాతిపదికన సీట్లను ఇస్తామని చెబుతూనే, పొంగులేటికి సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామని సునీల్‌ కనుగోలు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో చేరికకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.