NTV Telugu Site icon

Ponguleti Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy Joins Congress: ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా… పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది. భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన చేతుల మీదుగా కండువా కప్పి ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో తిరిగి పట్టు సాధించి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Also Read: Jana Garjana Meeting : సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్‌

తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. 2018లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటివరకు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు.

రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చినా.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగు భృతితో పాటు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ మాయ మాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఆరు నెలల పాటు అన్ని వర్గాలను కలిశానన్న పొంగులేటి.. అందరూ ఒకే మాట చెప్పారన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయడం కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. తెలంగాణ వచ్చినా 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీని గాలికి వదిలేశారన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

 

Show comments